Menu

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది.

2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51 వ లండన్ చలన చిత్రోత్సవం గురించి ప్రకటన రాగానే నా ప్రయత్నాల్లో మునిగిపోయాను. ఈ చిత్రోత్సవంలో దాదాపు 60 దేశాలనుంచి వచ్చిన 300 సినిమాల ప్రదర్శన జరుగుతుందని నాకు తెలుసు. వాటిల్లో కనీసం ఒక 50 సినిమాలైనా చూడాలని గట్టిగా నిర్ణయించేసుకున్నాను. అయితే ఇందులో చాలానే సమస్యలున్నాయి. ఒకటి: నేను వుండేది లండన్ లో కాకపోవడంతో రోజూ వెళ్ళి రావాలంటే కనీసం ఇరవై పౌండ్లైనా ఖర్చు(రోజుకి).రెండు: ఒక్కో సినిమా చూడ్డానికి దాదాపు 10 పౌండ్లైనా ఖర్చు చేయాల్సి రావడం. అంటే ఈ చిత్రోత్సవం కోసం దాదాపు మరో 700 పౌండ్లు ఖర్చు మొత్తానికి. అసలే ఎప్పుడూ కొద్ది కొద్దిగా వుండే నా బ్యాంకు బ్యాలెన్సు శూన్యం అయిపోవడం ఖాయం అనిపించింది.

అలా కాకుండా పెద్దగా ఖర్చు లేకుండా అన్ని సినిమాలు చూడడమెలానో నాకర్థం కాలేదు. బాగా ఆలోచించాక నాకొక ఆలోచన వచ్చింది. ఈ చిత్రోత్సవానికి డబ్బులు ఖర్చు చెయ్యకుండా వెళ్ళాలంటే మనం ప్రెస్ కి సంబంధించిన వాళ్ళమైనా అయ్యుండాలి లేదా ఇప్పటికే ఇంగ్లాండులో సినిమా తీసైనా వుండాలి. గతంలో మూడు లఘు చిత్రాలు ఇంగ్లాండులో తీసిన అనుభవం వున్నప్పటికీ అందులో ఏ ఒక్కటీ ప్రదర్శన వరకూ చేరుకోలేదు. ఇకపోతే వున్న ఒకే ఒక్క అవకాశం నేను జర్నలిస్టు వేషం కట్టడమే! అలాంటి సమయంలోనే నేను కొన్ని నెలలుగా రాస్తున్న బ్లాగు గుర్తుకొచ్చింది. ఆలోచన రావడమే ఆలస్యం, ఈ చిత్రోత్సవానికి ప్రెస్ రిలేషన్స్ నడిపే కంపెనీకి నా గోడు విన్నవించుకున్నాను. కొన్ని రోజుల పాటు ఉత్తర ప్రత్యుత్తరాల తర్వాత ఎలాగో నా గోడు భరించలేక నాకు ఒక పాస్ అందచేసారు. రెండు రోజులు ఉబ్బితబ్బిబ్బయిపోయాను.

పాస్ వచ్చింది. కానీ పదిహేను రోజుల పాటు ఆఫీసుకు శెలవు పెట్టడం కుదరదు. పోనీ శనాదివారల్లో వీలైనన్ని సినిమాలు కవర్ చేసి, మిగిలిన రోజు సాయంత్రాల్లో రోజుకో రెండు సినిమాలు చూసేద్దమని నిర్ణయించుకున్నా. అప్పటివరకూ బాగానే వుంది. తీరా నా పాస్ తో పాటు వాళ్ళు పంపించిన నియమ నిబంధనలు చూసాక నా ఆనందమంతా గాలి తీసేసిన టైర్లా అయిపోయింది. నా కిచ్చిన పాస్ తో నేను కేవలం పని దినాళో సాయంత్రం నాలుగు గంట్ల వరకూ ఏ సినిమాకైనా వెళ్ళొచ్చు. సాయంత్రం నాలుగు తర్వాత ప్రదర్శించే సినిమాలకు టిక్కెట్టైనా కొనుక్కోవాలి, లేదా నాకు టిక్కెట్టు కావాలని నిర్వాహకులకు విన్నపం చేసుకుంటే వారిష్టముంటే ఇస్తారు లేదంటే లేదు. శనాదివారాల్లోనూ ఇదే పరిస్థితి. అంటే నా పాస్ తో నేను ఒక్క సినిమా అయినా చూడడం కుదరదని తేలిపోయింది. రెండురోజులుగా నేను పడ్డ సంతోషమంతా గాలిలో కలిసిపోయింది.

ఆ షాక్ లోనుంచి నేను బయటపడేసరికి మరో రెండు రోజులుపట్టింది. సరే ఏదో ఒక ప్రయత్నం చేద్దామని ఆ ప్రెస్ రిలేషన్స్ నడిపే కంపెనీ వారికి ఫోను చేసి మరో సారి నా బాధంతా విన్నవించుకున్నాను. వారంతా విని నువ్వు ఎపుడెప్పుడు ఏయే సినిమాలకి టిక్కెట్లు కావాలో మాకు మైలు పంపించండి. ఆ తర్వాత మేము చూసుకుంటామన్నారు వాళ్ళు. హమ్మయ్య అనిపించి నా లిస్టంతా ఒక ఎక్సెల్ షీట్లో పెట్టి వాళ్ళకి మెయిల్ పంపి ఎదురుచూస్తూ కూర్చున్నాను. వారం రోజుల తర్వాత ’51st London Film Festival’ అని ముద్రించబడిన ఒక అందమైన బ్యాగైతే వచ్చింది కానీ టిక్కెట్ల గురించి మాత్రం ఎటువంటి సమాచారమూ రాలేదు.

చూస్తుండగానే సెప్టెంబరు పదిహేడో తేదీ వచ్చేసింది.మొదటి రోజు కేవలం ఒక్క సినిమా ప్రదర్శనే జరగడం, అదీ కాక దానికి కేవలం సినీ ప్రముఖులకి పరిమితం కావడంతో, సెప్టెంబరు 19వ తేదీ సాయంత్రం అఫీసులో పర్మిషన్ తీసుకుని హడావుడిగా బయల్దేరాను. అప్పటికీ నాకు సినిమాలు చూడగలనన్న నమ్మకంలేదు. నేను పంపిన మైల్ కి నాకెటువంటి సమాధానమూ రాలేదు. అయినా ధైర్యం చేసి లండన్ చేరుకున్నాను. మెడలో నా పాస్ వేసుకుని వెళ్ళి ఓడియన్ సినిమా హాల్ కెళ్ళి నా పాస్ చూపించి 4Months, 3Weeks and 2 days సినిమా కి టిక్కెట్లు కావాలని అడిగాను. మీరు లిస్టులో వున్నారా అనడగింది టిక్కెట్టు కౌంటర్లో కూర్చున్నామె. లేదని తలూపాను నేను. అయితే టిక్కెట్టు ఇవ్వడం కుదరదందామె. మళ్ళీ నిరాశ.కానీ ఇంతలోనే సినిమా మొదలయ్యే ఐదు నిమిషాల ముందు రండి అప్పుడు ఏవైనా టిక్కెట్లు మిగిలుంటే చూస్తాననడంతో అరగంట సేపు అక్కడే కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంటే ఒక ఫ్రెంచాయన పరిచయమయ్యాడు.అతనిదీ నా బాపతే. అతను చెప్పుకొస్తేనే అర్థమయ్యింది. ఇలా ఎదురుచూస్తే 99% తప్పక టిక్కెట్లు దొరుకుతాయని. ఆయనకు మనసులోనే కృతజ్ఞతలు తెలియచేసుకుని మరో పది నిమిషాలు ఎదురుచూసాక ఆ టిక్కెట్ కౌంటర్లో కూర్చున్నామె పిలిచి మరీ టిక్కెట్టిచ్చింది. బతుకు జీవుడా అనుకుని హాయిగా సినిమా చూసి బయటకొచ్చినప్పుడు నా మొహం చూడాల్సింది.

మొదటి సినిమ చూసిన అనుభవంతో మరో సారి అదే విధంగా ప్రయత్నిస్తే పోయేదేముందని ploy సినిమా, రాత్రి 9 గంటల షోకి టిక్కెట్ల కోసం ప్రయత్నించా. ఇక్కడా విజయం మనవెంటే వుంది. అక్కడ టిక్కెట్ల కోసం డజన్ల కొద్దీ వ్యక్తులు వరసలో నిల్చుని ఎదురుచుస్తుంటే ప్రత్యేక కౌంటర్లోకెళ్ళి పాస్ చూపించి టిక్కెట్ సాధించి విజయగర్వంతో నా నడకే ఒక మాదిరిగా అయిపోయిందంటే నమ్మండి(అదేదో సినిమాలో చిరంజీవికి లాగా).

ఆ విధంగా 51వ లండన్ చలన చిత్రోత్సవంలో నా మొదటి రోజు గడిచిపోయింది. ఆ సాయంత్రం నాకు ఆర్కూట్లో పరిచయయిన ఒక తెలుగు మిత్రునికి ఫోను చేసి ఈ రాత్రికి నీ గదిలో ఒక మూల పడుండే అవకాశమేదైనా వుందా అంటే వుందన్నాడు. కానీ అతని దగ్గర ఒక్కరికి సరిపడా పరుపు దిండ్లూ మాత్రమే వుండడంతో రాత్రి ఒంటిగంటప్పుడు దగ్గర్లో వున్న ASDA సూపర్ మార్కెట్ కెళ్ళి ఒక రజాయి కొనుక్కుని వచ్చాం. అందులో సగం నేలపైన పరిచి సగం నేను కప్పుకుని ఆ రాత్రి హాయిగా నిద్రపోయా, విజయ గర్వంతో.

శనివారం శెలవు దినం కావడంతో కాసేపు పడుకుందామని అనిపించినా నా టిక్కెట్టు రిక్వెస్టు సంగతేంటో తేల్చుకోవాలని బయల్దేరి British Film Institute దగ్గరున్న delegate centre వద్దకు బయల్దేరి వెళ్ళాను. వాళ్ళాఫీసు తెరిచీ తెరవగానే లోపలికెళ్ళి delegates ఇలాగేనా సత్కారం చేసేది అని అడిగి కడిగేద్దామనుకుని మనకంత సీనులేదు కనక దీనంగా నా టిక్కెట్ రిక్వెస్ట్ సంగతేంటని అడిగా. అందుకు వాళ్ళు మీరు మరీ అలా ఎక్సెల్ షీట్లు పంపిస్తే కుదరదు, ఏ రోజు సినిమాలు ఆ రోజుకి రెండు రోజుల ముందు మాకు పంపండి, మీకు 24 గంటల ముందే టిక్కెట్టు ఇవ్వగలమా లేదా అన్న విషయం తెలియ పరుస్తామని విడమర్చి చెప్పారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి శని ఆది వారాలు అంతకు ముందు రోజులాగే ప్రయత్నాలు చెయ్యకమానదని తెలిసిపోయింది.

అయినా సరే శని ఆది వారల్లో కనీసం పది సినిమాలైనా చూసి తీరాల్సిందే అని నిర్ణయించుకున్నాను. కానీ ఇంకా సినిమా మొదలవ్వడానికి మరో మూడు గంటలుండడంతో delegate center లోనే తచ్చట్లాడుతూ వుండిపోయాను. మరో అరగంట్లో చాలా మంది అక్కడికి రావడం కొంతమంది dvd లు తీసుకుని అక్కడున్న లాప్‌టాప్స్ సినిమాలు చూడడం, కాఫీలు, బీరులు, వైనులు తాగడం, బిస్కెట్లు గట్రా తినడంలో బిజీ అయిపోయారు. ఎవరు వీళ్ళంతా అని చూస్తే దాదాపు అందరూ మెడలో నాలాంటి పాస్ లే వేసుకుని వున్నారు. నా పాస్ తో పాటు నాకు వాళ్ళు పంపించిన నియమావళి గుర్తొచ్చింది. వెంతనే తీసి చదవడం మొదలుపెట్టా. అంతా చదివాక నాకర్థమయ్యిందేంటంటే ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించే సినిమాల్లో చాలా వరకూ ఇక్కడ డ్వ్డ్ ద్వారా కూడా లభ్యమవుతాయని. అంతే కాదు అక్కడ కాఫీలు, బిస్కెట్లు వుచితంగానే లాగించొచ్చని.అలా అని అందులో రాయలేదనుకోండి. ఇంకేముంది వెళ్ళి అదూర్ గోపాల కృష్ణన్ సినిమా అయిన Fఔర్ వొమెన్ డ్వ్డ్ తీసుకుని పక్కనే కాఫీ పెట్టుకుని కుర్చీలో కూలబడిపోయా.

ఆ సినిమా చూస్తున్నంత సేపూ మన దేశానికి చెందిన కుర్రాడొకడు అక్కడ బాగానే హడావుడి చేస్తుండం నా కళ్ళపడింది. సినిమా చూడడం అయిపోగానే వెళ్ళి అతనితో కాసేపు మాట్లాడాను. నేననుకున్నట్టే మనవాడే. బొంబాయి కుర్రాడు. మీరిక్కడేం చేస్తుంటారని అడిగితే ఈ చిత్రోత్సవం జరపడంలో సహాయం అందించే వాలంటీర్ అని చెప్పాడు. అతనూ నాలానే సాఫ్ట్వేర్ ఇంజనీరే అని తెలిసింది.నాకు తెలిసిన వాళ్ళలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాని వాళ్ళు ఎవరైనా వున్నారా అన్న అనుమానం కలిగింది.నా ఆలోచనల్లో మునిగిపోయి వుండగా ఇప్పుడే సినిమాకి అని అడిగాడతను. క్యాలెండర్ చూసుకుని Voyeurs అని చెప్పాను. పద పద మరి, అసలే బుద్ధ్ధదేవ్ దాస్ గుప్తా కూడా వస్తున్నారని హడావుడి పెట్టాడు. నా దగ్గర టిక్కెట్టు లేదని బిక్క మొహం వేసా. ఫర్వాలేదులే నేనొక టిక్కెట్టు తెస్తానని చెప్పి నిమిషంలో ఒక టిక్కెట్టు పట్టుకుని వచ్చాడు. కానీ ఇద్దరి సీట్లు వేరు వేరు దగ్గర రావడంతో మేమిద్దరమూ అప్పటికి విడిపోయాము. సినిమా అయిన తర్వాత ఎక్కడా కనిపించలేదతను. తర్వాత ఏ సినిమా వుందో క్యాలెండర్లో చూసుకుంటే రొమానియన్ సినిమాల గురించి ఒక చర్చా కార్యక్రమం నన్నాకర్షించింది. వెళ్ళి టిక్కెట్ట్లున్నాయా అని అడగ్గానే నా చెతిలో ఒక టిక్కెట్టు పెట్టడంతో సంతోషించాను.

రొమానియన్ సినిమా గురించి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి 4 Months, 3 Weeks, 2 Days సినిమా దర్శకుడు, California Dreamin’ సినిమా నిర్మాత తో పాటు మరికొంత మంది పాల్గొన్నారు. రొమానియా ఎంతటి పేద దేశమో నాకు తెలిసినప్పటికీ అక్కడ కేవలం 50 సినిమా హాళ్ళే వున్నాయని అందులోనూ 20 మాత్రమే కొంచే ఫర్వాలేదనిపించే సినిమా హాళ్ళని నాకప్పుడే తెలిసింది. అంతే కాదు 4 Months, 3 weeks and 2 days సినిమా దర్శకుడు (నిర్మాత కూడా) తన సినిమాని ప్రదర్శించడం కోసం వూరూరా తిరుగుతూ ప్రదర్శిస్తున్నాడంటే చాలా అశ్చర్యం కలిగింది. అంతటి దీన స్థితిలో వుండి కూడా ఆ దేశం నుంచి వచ్చిన రెండు సినిమాలు ఈ సంవత్సరం దాదాపు అన్ని చిత్రోత్సవాల్లోనూ అవార్డులు సాధించాయి.

ఆ చర్చా కార్యక్రమం తర్వాత Power, corruption and Lies అనే శీర్షికన ప్రదర్శించిన ఐదు లఘు చిత్రాలను చూడడం జరిగింది. ఆ సినిమాల్లో ఒకటైన Macau Twilight సినిమా దర్శకుడు Tony Shyu నా పక్కనే కూర్చున్నాడు. సినిమా అయ్యాక ఈయనతో మాట్లాడొచ్చు అనుకున్నా కానీ అక్కడ ప్రదర్శించిన మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమా అస్సలు బాగో లేదు. మరీ ఘోరంగా ఏమీ లేదు కానీ ఎక్కువ స్పెషల్ ఎఫెక్ట్స్ తో గందరగోళంగా అనిపించింది. అందుకే అతనితో ఏమీ మాట్లాడకుండానే వచ్చేసాను. అలా శనివారం ముగిసిందనుకుని నా మిత్రుని గదికి బయల్దేరాను. అక్కడికెళ్ళే సరికి ఆర్కుట్ మిత్రుడు నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.

ఆ రాత్రంతా మేమిద్దరం కలిసి తెలుగు సినిమా స్థితిగతులనూ, అతనికి అమితంగా ఇష్టమైన Antonioni సినిమాలనూ, చివరిగా CS రావు గారి కథలనూ చర్చిస్తుండడంలోనే గడిచిపోయింది. ఎప్పుడో పొద్దున నాలుగింటికి ఒక కునుకు తీసి మళ్ళీ ఎనిమిది కల్లా బయల్దేరాను.